36 సంవత్సరాల ప్రభుత్వోద్యోగ జీవితం గడిపి, నేను వ్యవసాయ శాఖలో జిల్లా అధికారిగా పదవీ విరమణ చేసే వరకు, కేవలం రసహీన సంసార జీవితం గడిపాను. నాకు 37 సంవత్సరాల యోగ జీవితంతో సుధీర్ఘ అనుబంధం ఉంది. అధ్యాత్మిక జీవన శైలి కొత్త కాకపోయినా, పరిపూర్ణ మార్గాన్ని అనుసరిస్తున్నానన్న సంతృప్తి కలుగలేదు.
భగవద్గీతా తో ఎలాంటి ప్రత్యక్ష అనుబంధం నా పూర్వ జీవితంలో లేదు. జూన్ 2021 లో గీతా పరివార్ లోకి వచ్చి, L4 స్థాయి పూర్తి చేసుకునే లోపు అయిన పరిచయాలు, ఏర్పడిన నిస్వార్థ అనుబంధాలు నాకు వసుధైక కుటుంబ భావనను కలుగజేశాయి. భక్తులకు సేవ ద్వారా పరమాత్మకు చేరువ కావొచ్చు అన్న భావనతో (భ.గీ.18-68), టెక్నికల్ అసిస్టెంట్, జీసి, మానిటరింగ్ టీమ్ లలో కొంత కృషి చేసి, నాలో పెరుగుతున్న తృష్ణ మేరకు, తుదకు మెసేజ్ ట్రాన్స్లేషన్ టీమ్ మరియు క్రియేటివ్ రైటింగ్ టీములో ప్రస్తుతం కొనసాగుతున్నాను. సాధారణ వ్యక్తులుగా మనలో ఉన్న రజో గుణ ప్రవృత్తి గుర్తింపు మరియు అజమాయిషీని కోరుకుంటుంది. దానికంటే ఉన్నతమైన త్రిగుణాతీత స్థితి అవశ్యమని నాలో భగవద్గీతా బీజం నాటింది. వేదోక్త సకామ కర్మల ద్వారా పుణ్యం సంపాదించినా, “క్షీణే పుణ్యే మర్త్యలోకం(వ్ఁ) విశన్తి…”(భ.గీ. 9-21) అన్నట్లు జనన మరణ చక్రం తప్పదు. ఫలాపేక్షతో దేవతారాధన కాకుండా, శాశ్వతుడు, సర్వోత్తముడగు పరమాత్ముని సేవించుట ద్వారా పరంధామం లభ్యమౌతుందని (భ.గీ.7-23) భగవానులు తెలియజేశారు. అందుకు వైరాగ్యమనే దృఢమైన శస్త్రంతో (భ.గీ.15-3) సంసార అశ్వత్థ వృక్షాన్ని చేధించాలి. ఆ జ్ఞానాన్ని గీతా పరివార్ ద్వారా లభ్యమైన భగవద్గీతా నాకు బోధించింది. భగవద్గీతా కంఠస్థీకరణ అవసరమే, కాని గురువులు గోవింద్ దేవ్ మహారాజ్ గారు తెలిపినట్లు, గీతాజ్ఞానాన్ని జీవితంలో అన్వయించుకోలేకపోతే, అది అసంపూర్ణమౌతుంది. వారాంతపు వివేచనల అనువాద ప్రక్రియ నా జ్ఞానాభివృద్ధికి వరప్రసాదమైనది.
అనన్య భావంతో, శ్రద్ధాభక్తులతో నిరంతర చింతన, ఫలాపేక్షరహిత కర్మలతో స్వధర్మాచరణ మనకు జన్నరాహిత్యం ప్రాప్తిస్తుంది.
గీతా చదవడమే కాదు, చదివించడం కూడ మనందరి బాధ్యత. నా ఈ ప్రయాణానికి కారణభూతులైనట్టి ఆద్యులు శ్రీ గోవింద్ దేవ్ మహరాజ్ గారికి, చోదకులైనట్టి సంజయ్ భయ్యా మరియు ఆశూ భయ్యా గార్లకు, గీతా జ్ఞాన ప్రసాదాన్ని వితరణ చేస్తున్న వివేచకులకు, దోషరహిత ఉచ్ఛారణను బోధించిన ప్రశిక్షకులకు, అడుగడుగున స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆత్మస్వరూపులైనట్టి శర్మాజీ మరియు ఇతర సాధకులకు శతాధిక ప్రణామాలు. జై శ్రీకృష్ణ !
కృష్ణమోహన్ రావు తేరాల
తెలంగాణ